ఉపాధి హామీ ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
ఉపాధి హామీ ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
హైదరాబాద్, ఆగస్టు 8: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగుల (FTE) దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఉపాధి హామీ ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (FTE JAC) ప్రతినిధులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. పే స్కేల్ అమలు, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, బదిలీల విధానం, ఇతర సర్వీస్ అంశాలను పరిష్కరించాలని కోరారు.
రెండు దశాబ్దాలుగా సేవలు.. ఇంకా పే స్కేల్ లేదు
2006లో డీఎస్సీ ద్వారా ఎంపికైన తాము దాదాపు రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు పే స్కేల్ అమలు కాలేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది కేవలం జీతాలకు సంబంధించిన సమస్య కాదని, తమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,800 మంది ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. పే స్కేల్ అమలు చేస్తే ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.2.5 కోట్ల అదనపు భారం పడుతుందని, రాబోయే నాలుగైదేళ్లలో పలువురు ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నందున ఈ ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుందని వివరించారు.
సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తా: సీతక్క
ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విన్న మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. పే స్కేల్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పే స్కేల్ అమలు వల్ల ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే అంచనా వేసిందని, ఏడాదికి సుమారు రూ.30 కోట్ల వరకు భారం ఉండవచ్చని సమావేశంలో వెల్లడించారు.
త్వరలోనే మరోసారి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై తదుపరి చర్యలపై చర్చిస్తామని మంత్రి తెలిపారు. ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రభుత్వం సమస్య పరిష్కారానికి సానుకూలంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
పని నిలిపివేయకుండా చర్చలతో పరిష్కారం
సమస్యల పరిష్కారం కోసం పని నిలిపివేయడం కంటే బాధ్యతాయుతమైన పద్ధతుల్లో ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం మంచిదని సీతక్క సూచించారు. జపాన్ తరహాలో మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే మార్గాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగులకు ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్) పథకాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని చెప్పారు.
మూడు నెలలుగా జీతాల జాప్యం
ఉపాధి హామీ ఉద్యోగుల జీతాల అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో గత మూడు నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని తెలిపారు.
ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా జీతాలు చెల్లించి, అనంతరం కేంద్రం నుంచి ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేసుకునే ప్రతిపాదన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని సీతక్క తెలిపారు. దీంతోనే జీతాల విడుదలలో ఆలస్యం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. సమావేశం జరుగుతుండగానే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి ఈ అంశంపై చర్చించేందుకు సీఎం సమయం కోరినట్లు వెల్లడించారు.
ఉద్యోగుల్లో హర్షం
మంత్రి సీతక్క హామీపై FTE ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క నాయకత్వంలో తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి హామీ పనులు కోరే ప్రతి కూలీకి పని కల్పించేందుకు అవసరమైతే అదనపు సమయం పనిచేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Post a Comment