ఇళ్ల కింద గుప్త నిధులంటూ మోసం.. రూ.కోటి కొల్లగొట్టిన ముఠా గుట్టురట్టు

 

ఇళ్ల కింద గుప్త నిధులంటూ మోసం.. రూ.కోటి కొల్లగొట్టిన ముఠా గుట్టురట్టు

ఇళ్ల కింద గుప్త నిధులంటూ మోసం.. రూ.కోటి కొల్లగొట్టిన ముఠా గుట్టురట్టు

హైదరాబాద్: ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత పూసిన నాణేలు, 6 కిలోల బొగ్గు, 4 కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, భూమిలో పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే విద్య తమకు తెలుసంటూ ప్రజలను నమ్మించేవారు.

బొగ్గును బంగారంగా మారుస్తామంటూ..

ముఠా సభ్యులు ముందుగా అమాయకులను గుర్తించి వారి నివాస స్థలాల కింద గుప్త నిధులు ఉన్నాయని చెప్పేవారు. వారు సూచించిన ప్రాంతంలో గుంత తీయించి, ముందుగానే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా గుంతలో పెట్టేవారు. అనంతరం అక్కడ పూజలు నిర్వహించి.. బొగ్గు కొంతకాలానికి బంగారంగా మారుతుందని నమ్మించేవారు. ఆ తర్వాత బాధితుల నుంచి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యేవారు.

సుమారు 11 మందిని మోసం.. రూ.కోటి వసూలు

ఈ విధంగా ముఠా హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో సుమారు 11 మందిని మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లోనే జన్మించి పెరిగాడు. చదువు పూర్తయ్యాక కార్ల డెంటింగ్, పెయింటింగ్ పనులు చేసేవాడు. కుటుంబ ఖర్చులకు ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు తెరతీసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026గా కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

గుప్త నిధులు ఉన్నాయని, వాటిని వెలికితీస్తామని చెప్పే వ్యక్తుల మాటలను నమ్మి ఎవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. రవి, ఎస్‌ఐలు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకున్నట్లు రాజేంద్రనగర్-శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు తెలిపారు.

Blogger ఆధారితం.