క్రీడా స్ఫూర్తితో గెలుపోటములను స్వీకరించాలి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
క్రీడా స్ఫూర్తితో గెలుపోటములను స్వీకరించాలి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
పాల్వంచ, ఆగస్టు 30: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు ఆదివారం కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఘనంగా ముగిశాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో వాటిని స్వీకరించాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ విధుల్లో నిత్యం బిజీగా ఉంటున్నప్పటికీ, క్రీడలకు సమయం కేటాయించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా పొందవచ్చని అన్నారు.
గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని రాహుల్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనడం ద్వారా పరస్పర స్నేహభావం, ఐక్యత, జట్టు స్ఫూర్తి మరింత పెంపొందుతాయని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
హోరాహోరీగా క్రీడా పోటీలు
అనంతరం డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి చందన మాట్లాడుతూ.. గతంలో గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించిన సందర్భాలు అరుదుగా ఉండేవని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ చొరవతో వినూత్నంగా క్రీడా పోటీలను నిర్వహించడం పట్ల పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగగా ఏకలవ్య జట్టు విజేతగా, భద్రాచలం జట్టు రన్నర్స్‌గా నిలిచింది. అదేవిధంగా షటిల్, క్యారమ్స్ పోటీల్లో ఏటీడీఓ దమ్మపేట జట్టు మొదటి స్థానాన్ని, భద్రాచలం జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అనంతరం నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమంలో ఏటీడీఓలు ఎస్. చంద్రమోహన్, ఇల్లందు భారతీదేవి, భద్రాచలం రాధమ్మ, కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ హెచ్‌ఎం ఎన్. చందు, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు, గిరిజన ఉద్యోగులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment