మహిళా శక్తి భవనం మహిళల శిక్షణ, సాధికారతకు వేదికగా నిలవాలి: కమిషనర్ దివ్య దేవరాజన్

మహిళా శక్తి భవనం మహిళల శిక్షణ, సాధికారతకు వేదికగా నిలవాలి: కమిషనర్ దివ్య దేవరాజన్


 మహిళా శక్తి భవనం మహిళల శిక్షణ, సాధికారతకు వేదికగా నిలవాలి: కమిషనర్ దివ్య దేవరాజన్

నిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు భవిష్యత్ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి

లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 6: మహిళల నైపుణ్యాభివృద్ధి, సాధికారతకు ఇందిరా మహిళా శక్తి భవనం వేదికగా నిలవాలని పంచాయతీరాజ్, ప్రజావాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల కమిషనర్ దివ్య దేవరాజన్ సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ఆమె పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పూల మొక్కను అందించి కమిషనర్‌కు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భవనంలోని వివిధ విభాగాలు, శిక్షణ హాళ్లు, మౌలిక సదుపాయాలను కమిషనర్ పరిశీలించారు. భవన నిర్మాణ ప్రగతి, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అధికారులు వివరాలు అందించారు. భవనంలో 100 మంది, 40 మంది సామర్థ్యంతో రెండు శిక్షణ హాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, సాధికారతకు సంబంధించిన విస్తృత శిక్షణ కార్యక్రమాలను ఈ భవనంలో నిర్వహించాలని దివ్య దేవరాజన్ సూచించారు. మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నూతన జిల్లాకు మంచి ఆస్తి

నూతన జిల్లాకు ఈ మహిళా శక్తి భవనం మంచి ఆస్తి, వరం వంటిదని కమిషనర్ పేర్కొన్నారు. భవన నిర్మాణంతో పాటు భవిష్యత్ నిర్వహణకు కూడా ఇప్పటి నుంచే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భవిష్యత్‌లో లీకేజీలు, డ్యాంప్‌నెస్ వంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా కాంపౌండ్ వాల్ పనులను కూడా పూర్తి చేయాలని, ఫినిషింగ్ పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు. మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా భవనంలోని అన్ని పనులను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.