కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య విమర్శలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య  విమర్శలు


 భద్రాచలంలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే లేరు

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య  విమర్శలు

బూర్గంపాడు రహదారి, పారిశుద్ధ్యం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై నిలదీత

భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నా వాటిని పరిష్కరించాల్సిన పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య విమర్శించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు, ఎన్నికల అనంతరం వారి సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపించారు.

ఆదివారం భద్రాచలంలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్యంపై పాలకులు సమాధానం చెప్పాలి

భద్రాచలం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని చైతన్య పేర్కొన్నారు. బ్రిడ్జి పరిసరాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారంపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నా సంబంధిత నాయకులు స్పందించడం లేదన్నారు. భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేస్తామని, ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చామని చెబుతున్న నాయకులు పట్టణ పారిశుద్ధ్యాన్ని ఎందుకు మెరుగుపరచడం లేదని ప్రశ్నించారు.

చిన్నపిల్లలు తిరిగే వీధుల్లో సైతం చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని నిబంధనలు విధించే అధికారులే మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయిస్తున్నారని విమర్శించారు. పట్టణం అభివృద్ధి చెందుతోందని చెబుతున్న పంచాయతీ పాలకవర్గం పారిశుద్ధ్య సమస్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పేదల ఎదురుచూపులు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకున్న పేదలకు ఇప్పటికీ సరైన సమాధానం లభించడం లేదని చైతన్య అన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి? ఎంతమందికి ఇళ్లు కేటాయించారు? అనే వివరాలను ప్రజలకు వెల్లడించడం లేదని తెలిపారు.

ఆరు నెలలుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పనిచేయడం లేదని చెబుతూ మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదని ఆరోపించారు.

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నప్పటికీ, ఖాళీ స్థలం ఉన్న పేదలను ఇంటి నంబర్ వంటి వివరాలు అడుగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పేదల సమస్యలపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారని ప్రశ్నించారు.

భద్రాచలంలో ప్రభుత్వ వ్యవస్థ నడుస్తోందా? ప్రైవేటు వ్యక్తుల వ్యవస్థ కొనసాగుతోందా? లేక ఎమ్మెల్యే అనుచరుల వ్యవస్థ నడుస్తోందా? అని ఆమె ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే చుట్టూ వస్తున్న ఆరోపణలపై నాయకులు ఎందుకు స్పందించడం లేదని, ఆర్థికపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో నాయకులు ఎందుకు సంబంధాలు కొనసాగిస్తున్నారని నిలదీశారు.

బూర్గంపాడు రహదారి సమస్యను పరిష్కరించాలి

భద్రాచలం ఆలయ అభివృద్ధి పేరుతో మంత్రులు తరచూ పర్యటిస్తున్నప్పటికీ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై దృష్టి సారించడం లేదని చైతన్య విమర్శించారు. మంత్రి భద్రాచలం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ బూర్గంపాడు రహదారి సమస్యను ప్రస్తావించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ రహదారిపై ప్రయాణించే కళాశాల విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీసం ఆర్టీసీ బస్సుల రూట్లను మార్చి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.

అదేవిధంగా చర్ల నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. దుమ్ముగూడెం మండలం నల్లబిల్లి వద్ద జరిగిన ప్రమాద సమయంలో అంబులెన్స్ రాకపోకలకు ఎదురైన ఇబ్బందులు రహదారుల దుస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి

భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక వ్యవహారం ఒక మాఫియా చేతుల్లోకి వెళ్లిందని కనగాల చైతన్య ఆరోపించారు. స్థానిక ప్రజలకు అవసరమైన ఇసుక సైతం అందుబాటులో లేకుండా పోయిందన్నారు. మరోవైపు ట్రాక్టర్ల ద్వారా ఇష్టానుసారంగా ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి స్థానిక ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

సాగునీరు లేక ఇబ్బందుల్లో రైతులు

దుమ్ముగూడెం మండలంలో సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని, రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం

భద్రాచలం నియోజకవర్గంలో పారిశుద్ధ్యం, రహదారులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు, ఇసుక అక్రమ రవాణా, సాగునీటి కొరత వంటి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కనగాల చైతన్య పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.