భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా రిజిస్ట్రేషన్ క్యాంపులు ప్రారంభం
భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా రిజిస్ట్రేషన్ క్యాంపులు ప్రారంభం
ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్
నెల రోజుల పాటు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక క్యాంపులు.. ఇతర ప్రభుత్వ బీమా పథకాల లబ్ధిదారులకూ అవకాశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. శుక్రవారం నుంచి అర్హులైన కుటుంబాల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడతలో 11 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక రిజిస్ట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
ఈ క్యాంపుల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీతో పాటు మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి వార్డులోనూ దశలవారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో అర్హులైన కుటుంబాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
రేషన్ కార్డు తప్పనిసరి
ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన కుటుంబాల వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అవకాశం ఉందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. కాబట్టి రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారు తప్పనిసరిగా తమ రేషన్ కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. రేషన్ కార్డు నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. కుటుంబంలో ఎవరి పేరుపై జీవిత బీమా చేయించాలి, నామినీగా ఎవరిని ఎంపిక చేయాలి, బీమా వాటాలను ఏ విధంగా కేటాయించాలి అనే వివరాలను కూడా నమోదు చేస్తారని వివరించారు.
ఇతర బీమా పథకాల లబ్ధిదారులకూ అవకాశం
ఇప్పటికే రైతు బీమా, చేనేత బీమా, బీడీ కార్మికుల బీమా, భవన నిర్మాణ రంగ కార్మికుల బీమా వంటి ఇతర ప్రభుత్వ బీమా పథకాల ప్రయోజనాలు పొందుతున్న కుటుంబాలు సైతం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇతర బీమా పథకాల లబ్ధిదారులైనంత మాత్రాన ఈ పథకానికి అనర్హులు కారని తెలిపారు.
దరఖాస్తు వివరాలను చదివి వినిపించిన తర్వాతే సమర్పణ
రిజిస్ట్రేషన్ సమయంలో లబ్ధిదారులు అందించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం, దరఖాస్తును సమర్పించే ముందు నమోదైన సమాచారాన్ని పూర్తిగా చదివి వినిపిస్తారని తెలిపారు. లబ్ధిదారుల అంగీకారం తీసుకున్న తర్వాతే దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పిస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన మొబైల్ నంబర్‌కు దరఖాస్తు ఐడీతో పాటు సంబంధిత సమాచారం ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతుందని వివరించారు.
క్యాంపుల్లో భౌతికంగా దరఖాస్తులు స్వీకరించడం, రసీదులు జారీ చేయడం ఉండదని స్పష్టం చేశారు. క్యాంపు కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో రేషన్ కార్డు వివరాలు, ట్రాన్సాక్షన్ ఐడీ, బీమా పొందే వ్యక్తి పేరు, నామినీ పేరు నమోదు చేసి దరఖాస్తుదారుడి సంతకం తీసుకుంటారని తెలిపారు.
రేషన్ కార్డులు లేని కుటుంబాలకు త్వరలో అవకాశం
ప్రస్తుతం రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలను నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌లో అవకాశం లేదని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అవకాశం అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆయా కుటుంబాల వివరాలను కూడా నమోదు చేస్తామని వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలు తమ రేషన్ కార్డులతో సమీపంలోని రిజిస్ట్రేషన్ క్యాంపులకు హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి, సీపీఓ సునీత, మండల ప్రత్యేక అధికారి బాబురావు పలు రిజిస్ట్రేషన్ క్యాంపులను సందర్శించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, సూపర్‌వైజర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment