విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ అంకిత్
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ అంకిత్
వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ – తెలుగు, ఇంగ్లీష్, గణితంలో విద్యార్థుల ప్రగతిపై ఆరా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నవంబర్ 25: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అన్నారు. ఇందులో భాగంగా బూర్గంపాడు మండలంలోని వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వారి అభ్యసన సామర్థ్యాలు, ప్రాథమిక విద్యా నైపుణ్యాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీష్, గణిత విషయాల్లో విద్యార్థుల ప్రగతిని తెలుసుకునేందుకు వారితో నేరుగా మాట్లాడారు.
విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివించడంతో పాటు తెలుగు అక్షరాలు, వర్ణమాలను రాయించారు. గణితంలో సంఖ్యలు, కూడికలు, తీసివేతలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. విద్యార్థులు చదువులో ఎలాంటి భయం, సంకోచం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాలని ప్రోత్సహించారు.
అనంతరం పాఠశాలలో ఒకటి, రెండో తరగతుల విద్యాబోధన తీరును పరిశీలించారు. చిన్నారులకు అక్షరాలు, సంఖ్యల గుర్తింపు, చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను ఏ విధంగా నేర్పిస్తున్నారనే విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రాత సాధన, ఉద్దీపన కార్యక్రమాలు, విద్యార్థుల రోజువారీ హాజరు వివరాలపై ఆరా తీశారు.
విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే చదవడం, రాయడం, గణితంపై పట్టు సాధించేలా బోధన అందించడం అత్యంత ముఖ్యమని ఈ తనిఖీ ద్వారా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని ఉపాధ్యాయులు నిరంతరం పరిశీలిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ ద్వారా తెలియజేశారు.

Post a Comment