బంగాళాఖాతంలో బలపడుతున్న ఆవర్తనం – ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
అమరావతి, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు ఈ ఆవర్తనం విస్తరించి, తమిళనాడు తీరం మీదుగా కొనసాగుతోంది. ఈ నెల 13నాటికి ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని సూచించారు.
ఈ రోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
Post a Comment