సిద్దిపేటలో ఆరోగ్య సంక్షోభంపై హరీశ్ రావు ఆందోళన

సిద్దిపేటలో ఆరోగ్య సంక్షోభంపై హరీశ్ రావు ఆందోళన


సిద్దిపేట : జిల్లాలోని తిమ్మాపూర్‌లో పారిశుద్ధ్య లోపాల కారణంగా ఉధృతమవుతున్న వైరల్ జ్వరాలు ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆదివారం గ్రామాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు, స్థానిక పరిస్థితులను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

డెంగీతో మహేశ్ (35), శ్రవణ్ (15) మృతి చెందడం హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 50 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి ఓదార్చిన ఆయన, ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ "మొద్దు నిద్రలో" ఉందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

డెంగీ నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని బలోపేతం చేసి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

"ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు నివారించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం" అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.