హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు!


హైదరాబాద్, ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం బడా గణనాథుడు కొలువుదీరనున్న నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు, మొత్తం పది రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ శాఖ స్పష్టం చేసింది.

ప్రభావిత ప్రాంతాలు

ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ పరిసరాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు.

మార్గ మళ్లింపులు

  • పీవీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలు → రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి నిరంకారి జంక్షన్ వైపు మళ్లింపు.
  • పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా వచ్చే వాహనాలు → ఇక్బాల్ మినార్ వైపు.
  • నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లేవారు → తెలుగుతల్లి ఫ్లైఓవర్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా.
  • నిరంకారి నుంచి రైల్వే గేట్ వైపు వెళ్లేవారు → పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ దారి.

పార్కింగ్ సదుపాయాలు

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటుచేశారు.

  • నెక్లెస్ రోటరీ – ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వాహనాలు → ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్, అలాగే ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం.
  • ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వచ్చేవారు → విశ్వేశ్వరయ్య భవన్ వద్ద వాహనాలు నిలుపుకోవాలి.

ప్రజా రవాణా వినియోగం

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు భక్తులు వీలైనంత వరకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.