గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్


కొత్తగూడెం, జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు.

శనివారం ఐడిఓసీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.

కలెక్టర్ మాట్లాడుతూ—

  • అన్ని గణేష్ మండపాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,
  • మండపాల్లో విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరి అని,
  • మైక్ వినియోగానికి పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని తెలిపారు.

నిమజ్జనం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రూట్ మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాలని, నిమజ్జనం ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలకు రవాణా శాఖ ధ్రువీకరణ తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఉత్సవాల సమయంలో భక్తి గీతాలే వినిపించాలనీ, మత సామరస్యానికి భంగం కలిగించే అంశాలు నిషేధమని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడరాదని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిపిఓ చంద్రమౌళి, డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఆర్డీవో మధు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.