మరోవ్యక్తితో కలసి భర్తను హత్య చేసిన భార్య..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న రాకేష్ కుమార్ (బీహార్)ను అతని భార్య పూనమ్ దేవి, మరో వ్యక్తి మహేశ్ సానితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
రెండు నెలల క్రితం రాకేష్ దంపతులు ఫామ్‌లో కూలీలుగా చేరారు. ఈ నెల 21న రాకేష్ తన భార్యతో పాటు మహేశ్ సానితో కనిపించాడు. అయితే మరుసటి రోజు రాకేష్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని రాజిరెడ్డి అతని గురించి విచారించగా.. మద్యం తాగి తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లిపోయాడని పూనమ్ దేవి చెప్పింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో యజమాని ఏజెంట్‌ను సంప్రదించాడు.
దీనితో నిజం బయటపడింది. పూనమ్ దేవి, మహేశ్ సాని కలిసి రాకేష్ తలపై రాయితో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని బావి పక్కన పడేశారని ఏజెంట్ తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
Post a Comment