ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం

 

ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం

పులివెందులలో చరిత్ర సృష్టించిన టీడీపీ

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వైసీపీ బలమైన కోటగా పరిగణించే పులివెందులలో టీడీపీ ఏకంగా డిపాజిట్ గల్లంతు చేయించడం చారిత్రక ఘట్టంగా నిలిచింది.

జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 10,601 ఓట్లు పోలైన ఈ ఎన్నికలో లతారెడ్డి 6,716 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు మాత్రమే పొందారు. ఇది 30 ఏళ్ల తర్వాత పులివెందులలో టీడీపీకి వచ్చిన అత్యంత ఘనవిజయం కావడం విశేషం.

విజయానంతరం లతారెడ్డి మాట్లాడుతూ, “ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి గెలిపించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి ప్రధాన కారణం” అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, “పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. వచ్చే ఎన్నికల్లో జగన్ కోటను బద్దలు కొడతాం” అని పేర్కొన్నారు. పార్టీ విజయానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 12,780 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి 6,513 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఈ ఫలితాలు కడప జిల్లాలో టీడీపీ పునరాగమనానికి నాంది పలికినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.