రైతులపై లాఠీఛార్జ్.. తీవ్రంగా ఖండించిన హరీశ్‌రావు
హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఎరువుల కోసం లైన్లో నిలిచిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులను ఇబ్బందులు పెట్టడమే కాకుండా వారిపైనే పోలీసులతో దాడి చేయించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.
సకాలంలో రైతులకు ఎరువులు అందించకపోవడంతో రాత్రింబగళ్లు లైన్లలో వేచి ఉండే దుస్థితి వచ్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. దీనికి ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పవలసిన బదులు, వారిపైనే లాఠీచార్జ్ చేయించడం "సిగ్గుచేటు" అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా హోం మంత్రిగా ఉన్నప్పటికీ రైతులపై లాఠీచార్జ్ జరగడం అమానుషమని హరీశ్‌రావు విమర్శించారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Post a Comment