ఎస్సీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రాంతీయ నాయకులారా గొంతెత్తండి..!

మైదాన ప్రాంత నాయకులారా.. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించండి..!


కొత్తగూడెం: షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి హెడ్ ఆఫీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం నుండి విడుదల చేసిన ఈ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ —

“ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. హక్కులు, దిక్కులేని దుర్బర పరిస్థితిలో నెట్టివేయబడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ సౌకర్యాలు, అభివృద్ధి అవకాశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా అడ్డుకుంటున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య” అని ఆయన ఆరోపించారు.

అలాగే, “ఏజెన్సీ ప్రాంత దళిత నాయకులంతా గొంతు ఎత్తి ప్రభుత్వాలను ప్రశ్నించాలి. మైదాన ప్రాంత దళిత నాయకులు కూడా అండగా నిలిచి ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని బహిర్గతం చేసి ప్రభుత్వాలను నిలదీయాలి” అని పిలుపునిచ్చారు.

“పార్టీలు, సంఘాలు తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఉద్యమాల పేరుతో ఏజెన్సీ ప్రాంత ఎస్సీలను శ్రమదోపిడికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలు మాత్రం ఏజెన్సీ ప్రాంత ఎస్సీలను సవితి తల్లి బిడ్డల కన్నా హీనంగా చూస్తున్నాయి. ఒకే రాష్ట్రంలో నివసించే దళితులు ప్రాథమిక హక్కులకే నోచుకోకుండా వివక్షకు గురవుతుండటం విచారకరం” అని బొమ్మెర శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, మహబూబ్‌నగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 75 మండలాలు, దాదాపు 10 లక్షల ఏజెన్సీ ప్రాంత దళితులు అభివృద్ధికి దూరం చేయబడుతున్నారని ఆయన గట్టిగా ఖండించారు.

చివరగా, “దళిత మేధావులు, విద్యావంతులు, నాయకులు అందరూ ఏకమై ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించి, అండగా నిలబడాలి. ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంత దళితులకు శాశ్వత నష్టం వాటిల్లుతుంది” అని ఆయన హెచ్చరించారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.