గర్భిణీ స్త్రీలకు ఎన్ని కష్టాలో రోడ్డు సౌకర్యం లేమితో గిరిజనుల కష్టాలు తీరడం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణీ స్త్రీల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కానట్లే కనిపిస్తున్నాయి. రోడ్డు సౌకర్యం లేమితో గిరిజనుల కష్టాలు తీరడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు అధికారంలోకి వచ్చినా, ఈ పల్లెల గిరిజనుల బ్రతుకులు మాత్రం మారడం లేదు.
ప్రసవ వేదన వచ్చినా, ఏదైనా అనారోగ్యం కలిగినా, ఇప్పటికీ గిరిజన మహిళలు ఆసుపత్రి చేరుకోవాలంటే "డోలీ మోతలే ఆధారం." అరకులోయ, చింతలపాలెం, రేగుళ్లపాలెం వంటి పలు మారుమూల గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రోడ్లు లేక వాగులు, వంకలు దాటాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలు సమయానికి ఆస్పత్రికి చేరుకోక ప్రాణాలు కూడా కోల్పోయారు.
తాజాగా చింతలపాలెం గ్రామానికి చెందిన కొర్రా జానకి నిండు గర్భిణీగా ఉండగా పురిటి నొప్పులు అధికమయ్యాయి. గ్రామానికి వాహనం చేరలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను డోలీలో మోసుకెళ్లడం ప్రారంభించారు. ఒక కిలోమీటరు మేర డోలీలో మోసుకెళ్లిన తర్వాత బూసిపుట్టు సమీపంలో దారిలేకపోవడంతో సుమారు ఒక కిలోమీటరు నడిపించాల్సి వచ్చింది.
తర్వాత కొండిభకోట వరకు మరో నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకువెళ్లి, ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను అతి కష్టం మీద దాటించారు. చివరికి రేగుళ్లపాలెం మెయిన్ రోడ్డుకి చేరుకొని అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఇలాంటి ఘటనలు అల్లూరి సీతారామరాజు జిల్లా పలు మండలాల్లో తరచూ పునరావృతమవుతుండటంతో, గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మాటలకే పరిమితం కాకుండా, కనీసం రహదారి సౌకర్యం అయినా ఇప్పటికీ కల్పించాలని" గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post a Comment