మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో వైద్యాధికారుల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి, డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు.
అటవీశాఖ అధికారులు తమ పరిధిలో గంజాయి సాగును గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రతి నెల తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇంటర్ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఈ వారంలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, పోలీస్‌స్టేషన్ల పరిధిలో విద్యార్థులు, యువత, ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, ర్యాగింగ్‌ను ప్రారంభ దశలోనే అరికట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో జడ్‌పి సీఈవో నాగలక్ష్మి, ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి జయలక్ష్మి, రవాణాశాఖ అధికారి వెంకటరమణ, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Post a Comment