దంచికొడుతున్న వర్షం… హైదరాబాద్ జలమయం
హైదరాబాద్: నగరంపై వరుణుడి ఆగ్రహం కొనసాగుతోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై, రహదారులపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాతావరణ శాఖ ప్రకారం, సాయంత్రం 6 గంటల వరకు మరిన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే నగరానికి ఎల్లో అలర్ట్ జారీ అయింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా అమీర్‌పేట్, మైత్రివనం ప్రాంతాల్లోని వాటర్ లాగింగ్ పాయింట్స్‌ను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా కూడా వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. 🌧️
Post a Comment