మృత్యువులోనూ వీడని స్నేహబంధం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత ● దుప్పిలపాడులో విషాదఛాయలు
టేక్కలి రూరల్ : కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణస్నేహితులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో దుప్పిలపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి మండలం దుప్పిలపాడుకు చెందిన సబ్బి అప్పన్న (35) హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొద్ది రోజుల క్రితం స్వగ్రామం వచ్చి, గురువారం అత్తవారి ఊరైన పాకివలసకు వెళ్లాడు. అక్కడ స్నేహితుడు పిట్ట గంగయ్య (32)తో కలుసుకున్నాడు. ఇద్దరూ తర్లిపేటలోని ఒక దాబాకు వెళ్లి భోజనం చేసి తిరిగి వస్తుండగా, శ్రీపురం సమీపంలో వారి ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
హెల్మెట్లు ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పన్న, గంగయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుల్లో అప్పన్నకు భార్య లావణ్య, పిల్లలు ప్రియాంక, హారిక, మణికంఠ ఉండగా, గంగయ్యకు భార్య వాణిశ్రీ, పిల్లలు నిఖిల్, దీక్షిత్ ఉన్నారు. ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో గాఢ విషాదం నెలకొంది.

Post a Comment