షాకింగ్ వీడియో: వాగు వరదలో చిక్కుకున్న కార్మికుల ఆర్తనాదాలు
కామారెడ్డి జిల్లా – ఆగస్టు 27 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బొగ్గు గుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తూ భయానక దృశ్యాలను సృష్టించింది. వాగు తీరంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఒక్కసారిగా విఘాతం చెందగా, పనిలో నిమగ్నమైన కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణ భయంతో వాగులోనే నిలిచిపోయిన వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి కాపాడాలని వారు ఆర్తనాదాలు చేస్తూ సహాయం కోసం అరిచిన దృశ్యాలు కెమెరాలో బంధం కావడంతో ప్రజల్లో ఆందోళన చెలరేగింది.
సమీప గ్రామాల ప్రజలు ఈ దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. వాగు ఒక్కసారిగా ఉధృతంగా వచ్చి కార్మికులను చుట్టుముట్టింది. ఎటు వెళ్లలేని పరిస్థితిలో వారంతా ట్యాంకర్‌పై గుమికూడి ప్రాణ రక్షణ కోసం అల్లాడుతుండటంతో, ఆర్తనాదాలు హృదయ విదారకంగా మారాయి.
సమాచారం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఆపరేషన్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా తమ వంతు సహాయం అందించేందుకు ప్రయత్నించారు.
ప్రస్తుతం కార్మికుల పరిస్థితిపై అధికార వర్గాలు సమాచారం సేకరిస్తుండగా, ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Post a Comment