అగ్నిప్రమాదం.. మంటల్లో రూ. 100 కోట్లు ఆస్తి భస్మం
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో అర్థరాత్రి భయానక అగ్నిప్రమాదం సంభవించింది. డెక్సన్ మొబైల్ కంపెనీ పక్కన ఉన్న మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్ లో మంటలు అకస్మాత్తుగా చెలరేగి భారీగా విస్తరించాయి.
అర్థరాత్రి సుమారు 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో మంటల నియంత్రణకు రంగంలోకి దిగారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన బ్యాటరీలు, మిషనరీ, ముడి పదార్థాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ ఘటనలో దాదాపు రూ. 70-80 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. కొంతమంది అధికారులు అయితే నష్టం రూ.100 కోట్ల వరకు చేరవచ్చని పేర్కొంటున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
Post a Comment