తెలంగాణ విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్‌షిప్ – బ్రిటిష్ హైకమిషనర్ సూత్రప్రాయ అంగీకారం
హైదరాబాద్: సెప్టెంబర్ 18: యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షిప్ను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ విద్యార్థులకు అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆమెతో భేటీ సందర్భంగా వెల్లడించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ హైకమిషనర్ (హైదరాబాద్) గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, సాంకేతిక రంగాల్లో తెలంగాణ-యూకే సహకారం విస్తరించాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు యూకే విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని, అడ్మిషన్లు మరియు సంబంధిత కార్యక్రమాలను హైదరాబాద్ నుంచే నిర్వహించేలా చూడాలని సూచించారు. తెలంగాణలో తీసుకురాబోయే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా గురించి కూడా ఆయన లిండీ కామెరాన్‌కు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు. అలాగే, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ సెంటర్లు, అకాడమీలు తదితర రంగాల్లో బ్రిటిష్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చ జరిగింది.
ఈ భేటీతో తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ విద్యావకాశాలు మరింత విస్తరించనున్నాయి.
Post a Comment