బీసీలకు 42% శాతం రిజర్వేషన్ జీవో జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో నంబర్ 9ని విడుదల చేసింది.
గతేడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలను సవివరంగా పరిశీలించింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో—
- బీసీలు : 1,64,09,179 (46.25%)
- బీసీ ముస్లింలు : 35,76,588 (10.08%)
- ఎస్సీలు : 61,84,319 (17.43%)
- ఎస్టీలు : 37,05,929 (10.45%)
- ఓసీ ముస్లింలు : 8,80,424 (2.48%)
- ఇతర ఓసీలు : 44,21,115 (13.31%) ఉన్నట్లు వెల్లడైంది.
ఈ గణాంకాల ఆధారంగా బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపగా, అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి గవర్నర్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం లేక ఆలస్యమైనా, రాజ్యాంగంలోని 243-డీ(6), 243-టీ(6) అధికారం వినియోగిస్తూ తాజాగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
దీంతో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు రిజర్వేషన్ల అమలుకు చర్యలు ప్రారంభించనున్నాయి. బీసీల రిజర్వేషన్ పెంపుపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
👉 ఇది తెలంగాణలో బీసీలకు చారిత్రాత్మక విజయంగా భావిస్తున్నారు.

Post a Comment