మూసీ ఉగ్రరూపం – జలదిగ్బంధంలో ఎంజీబీఎస్ బస్టాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో కుండపోత వర్షం మూసీ నదిని ఉగ్రరూపం దాల్చేలా చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత మూసీ నది ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చాదర్‌ఘాట్ లో లెవల్ వంతెనపై వరద నీరు ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై పది అడుగుల మేర ప్రవహించింది. ఫలితంగా ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు ప్రధాన బ్రిడ్జిలు మునిగిపోయాయి. ఈ వరద ఉధృతి కారణంగా బస్టాండ్ లోపలకే నీరు చేరి వందలాది మంది ప్రయాణికులు అక్కడికక్కడే చిక్కుకుపోయారు. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్‌లోకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. రాత్రి వేళ పరిస్థితిని స్వయంగా సమీక్షించి పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఎంజీబీఎస్ పరిసరాలు వరదనీటితో మునిగిపోవడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు, రెస్క్యూ బృందాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Post a Comment