కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ విద్యా రంగానికి కొత్త ఊపిరి

న్యూఢిల్లీ: తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తేవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకూ మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఆమెను కలిసి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వివరించారు.

రాష్ట్రంలో 105 శాసనసభ నియోజకవర్గాల్లో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు” ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగు స్కూళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, మిగతా వాటికి టెండర్లు పూర్తయ్యాయని ఆయన వివరించారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంటుందని, మొత్తం 2.70 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు ₹21 వేల కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. అదనంగా రాష్ట్రంలోని జూనియర్‌, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, మౌలిక వసతుల కల్పనకు ₹9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.

విద్యా రంగం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి, అలాగే ఈ వ్యయాన్ని ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించడానికి అనుమతించాలని సీతారామన్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వంలో అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా మారిన నేపథ్యంలో, వాటి రీస్ట్రక్చరింగ్‌కు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. ఈ అంశాలపై సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు డాక్టర్ మల్లూ రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.



కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.