మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది – సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది – సీఎం రేవంత్ రెడ్డి


మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం వేముల గ్రామంలో ఎస్‌జీడీ-కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన యూనిట్‌ను సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ పాలమూరు వెనుకబాటుతనాన్ని అధిగమించి, విద్య, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలబెట్టడం తన నైతిక ధర్మమని స్పష్టం చేశారు.

ఒకనాడు వలసలకు మారుపేరుగా నిలిచిన పాలమూరు ఇప్పుడు పరిశ్రమల కేంద్రంగా మారబోతోందని తెలిపారు. స్థానిక యువతకే కాకుండా రాష్ట్రం నలుమూలల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆగిపోయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని, విద్యారంగంలో రెండో ట్రిపుల్ ఐటీతో పాటు ఇంజనీరింగ్, లా, మెడికల్ కాలేజీలను కూడా జిల్లాకు తీసుకురావడంపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేశామని, వలసల తలరాతను మార్చేది విద్య మాత్రమేనని సీఎం పేర్కొన్నారు.

ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని, అధికారం దృష్ట్యా కలెక్టర్లు ప్రత్యక్షంగా రైతులను కలుసుకుని సమగ్రమైన నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.

భవిష్యత్తులో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ, డ్రైపోర్ట్, డిఫెన్స్ కారిడార్ వంటి ప్రాజెక్టులు మహబూబ్‌నగర్‌లోనే రావడానికి కృషి చేస్తామని, పరిశ్రమలు, విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు కలసి జిల్లాను సమున్నత స్థానంలో నిలబెడతాయని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.