తెలంగాణ వడివడిగా ‘స్థానిక’ ఎన్నికలకు అడుగులు
సీఎస్ నుంచి గ్రామ కార్యదర్శి వరకు ఏర్పాట్లలో నిమగ్నం
జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
రిజర్వేషన్లు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బూత్‌లు తదితరాలపై సూచనలు
బీసీ రిజర్వేషన్లపై కసరత్తు ప్రారంభం – ఓటర్ల జాబితాల్లో కులాలవారీగా మార్కింగ్
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి తక్షణమే తేదీలు ఖరారు చేసే అవకాశం ఉండటంతో, సీఎస్ కె. రామకృష్ణారావు ఆదివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
🔹 బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో త్వరలో
సర్కార్ నుండి వచ్చే రెండు రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో వెలువడనున్నట్టు సమాచారం. ఆ తర్వాత వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
🔹 కులాలవారీగా ఓటర్ల జాబితా మార్కింగ్
జిల్లా కలెక్టర్లకు, డీపీవోలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఓటర్ల జాబితాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలను గుర్తించే ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభించారు. ఈ ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు.
🔹 ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే
రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే తొలుత జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు ద్వారా లబ్ధి పొందవచ్చుననే అంచనాతో అధికార కాంగ్రెస్ పార్టీ వీటినే ముందుగా నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అనంతరం 2–3 వారాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
🔹 అధికారిక నిర్ణయం సమీపంలో
బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎన్నికల షెడ్యూల్‌పై ముఖ్యమంత్రి, మంత్రుల సమీక్ష సమావేశం మరో 2–3 రోజుల్లో జరిగి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Post a Comment