ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత : మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్
కొత్తగూడెం, సెప్టెంబర్ 5 : అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపంతో సమాజాన్ని సంస్కరించే ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్‌లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వారైనా ఒకప్పుడు ఓనమాలు నేర్చుకున్నది ఉపాధ్యాయుల వద్దనేనని, నేడు ఉన్న స్థానానికి వారే కారణమని గుర్తు చేశారు. ఎలాంటి ఉన్నత స్థాయికి ఎదిగినా ఉపాధ్యాయులను గౌరవించడం మరవకూడదని విద్యార్థులను కోరారు.
ప్రస్తుతం విద్య వ్యాపార వస్తువుగా మారిపోవడం వల్ల ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం తగ్గిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులను ఎల్లప్పుడూ గౌరవభావంతో చూసి, వారివద్ద జ్ఞానం సేకరించి ఉన్నత స్థానాలకు చేరుకొని దేశ సేవ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. నృత్యాలు, నాటికలు ప్రదర్శించి సందడి వాతావరణం సృష్టించారు. అనంతరం విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు నీలా, లక్ష్మీ ప్రసన్న, నసరత్ సరస్వతీ, సల్మా, విజయలక్ష్మి, జేఫీషా, ఖాజా, అనితా తదితరులు పాల్గొన్నారు.
Post a Comment