తెలంగాణలో సినీ రంగానికి ప్రత్యేక వెబ్‌సైట్ చైర్మన్ దిల్ రాజు
హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో సినిమా నిర్మాణం ఇక సులభతరమవనుందని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. సినిమాల చిత్రీకరణ, థియేటర్ల నిర్వహణ, అనుమతుల పొందడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్ “Films in Telangana” ని రూపొందిస్తోందని తెలిపారు.
ఈ కొత్త వెబ్‌సైట్ ద్వారా—
- చిత్రీకరణ అనుమతులు
- థియేటర్ల నిర్వహణ అనుమతులు
- వివిధ శాఖల నుంచి అవసరమైన క్లియరెన్సులు
- షూటింగ్ లొకేషన్లు
- టెక్నీషియన్ల సమాచారం
- రాష్ట్రంలోని నగరాల్లో హోటళ్ల వివరాలు
— అన్నీ ఒకే వేదికలో అందుబాటులోకి రానున్నాయి.
బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన వర్క్‌షాప్‌లో దిల్ రాజు, ఎఫ్‌డిసి మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ప్రియాంక, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతితో పాటు సినీ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
“స్క్రిప్ట్‌తో హైదరాబాద్‌కి వచ్చిన నిర్మాతలకు ఇక అన్ని సదుపాయాలు ఒక్క క్లిక్‌తో అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సౌలభ్యం దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ప్రారంభమవుతోంది” అని దిల్ రాజు స్పష్టం చేశారు.

Post a Comment