రాష్ట్రంలో ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కా పర్యవేక్షణ ఉండాలి సీఎం ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణపై పక్కా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల పరిధిలో ఉన్న దీపాల బాధ్యతలను పూర్తిగా సర్పంచులకే అప్పగించాలని స్పష్టం చేశారు.
❇️ పంచాయతీ రాజ్, మున్సిపల్, జీహెచ్ఎంసీ విభాగాలపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష జరిపిన సీఎం, ప్రతి గ్రామంలో ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో, కొత్తగా ఎన్ని అవసరం ఉన్నాయో ఖచ్చితంగా అంచనా వేయాలని ఆదేశించారు. ప్రతి పోల్ లెక్కించేలా సర్వే నిర్వహించాలని సూచించారు.
❇️ రాత్రిపూట లైట్లు సక్రమంగా పనిచేయడమే కాకుండా, పగటిపూట విద్యుత్ దుర్వినియోగం జరగకుండా కఠిన పర్యవేక్షణ అవసరమని చెప్పారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు ఈ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు.
❇️ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని అధికారులు వివరించారు. వాటి నిర్వహణ సర్పంచులకే అప్పగిస్తే విద్యుత్ వృథా నివారించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
❇️ అన్ని గ్రామాల లైట్లను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉండగా, కోర్ అర్బన్ సిటీ కలుపుకొని మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరం అవుతాయని మున్సిపల్ శాఖ నివేదించింది.
❇️ కొత్తగా ఏర్పాటయ్యే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన ఎల్ఈడీ లైట్ల కోసం టెండర్లు పిలవాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న కంపెనీలను ఆహ్వానించి, ఏడేండ్లపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్నారు.
❇️ ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్‌లను ఏర్పాటు చేసి, వాటి పనితీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలని ఆదేశించారు.
❇️ జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు నెలకు సుమారు రూ. 8 కోట్ల కరెంటు బిల్లు వస్తోందని, దీనికి ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్ వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post a Comment