వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు!
ఆదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్ 15 : ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పుపైకి ఎగబాకింది. మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా ప్రాణాల కోసం ఎంతటి సాహసానికైనా వెనకాడవని ఇది మరోసారి రుజువైంది.
భోరజ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టాడు. ఆ సమయంలో కొన్ని వీధి కుక్కలు గుంపుగా చేరి దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో భయంతో ఆ ఎద్దు కట్టును తెంచుకుని పరుగులు పెట్టింది. పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎగబాకి, అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పుపైకి చేరి ఊపిరిపీల్చుకుంది.
ఇంటి పైకప్పుపై ఎద్దును చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. చివరికి తాళ్ల సాయంతో గ్రామస్తులు శ్రమించి ఎద్దును కిందకు దించారు. అయితే ఈ సంఘటనలో ఇంటి పైకప్పుకు స్వల్ప నష్టం వాటిల్లింది.
ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే తమ మొబైళ్లలో వీడియోలు, ఫోటోలు తీశారు. అవి క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Post a Comment