లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన నకిలీ ఎస్‌ఐ అరెస్ట్
కొవ్వూరు, సెప్టెంబర్ 18: లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసు అధికారిని కొవ్వూరు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారని రూరల్ ఎస్‌ఐ కె.శ్రీహరిరావు తెలిపారు.
మేడ్చల్ జిల్లా దూలపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సంతోష్ అనే డ్రైవర్ ఈ నెల 16వ తేదీ రాత్రి శంషాబాద్ నుంచి ఐషర్ వ్యాన్‌లో వాషింగ్ పౌడర్ దిగుమతి సరుకును రాజమహేంద్రవరంలోని ఒక మాల్ వద్ద ఖాళీ చేసి వెనుదిరిగాడు. కొవ్వూరు మండలం గోవర్ధనగిరిమెట్టలోని జియో పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని ఆపి నిద్రిస్తున్న సమయంలో, ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గోదాంల వద్ద బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సరేళ్ల సంజయ్‌రాజు (నిందితుడు) హోండా షైన్ బైక్‌పై పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ వేషధారణలో వచ్చాడు.
చేతిలో మాన్‌ప్యాక్ పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేస్తూ రికార్డులు సరిగా లేవంటూ డ్రైవర్‌ను బెదిరించాడు. స్టేషన్‌కు తీసుకెళ్తానని భయపెట్టిన అనంతరం రూ.2 వేల నగదు తీసుకుని వదిలేశాడు. ఈ విషయంపై డ్రైవర్ సంతోష్ ఫిర్యాదు చేయడంతో, డీఎస్పీ దేవకుమార్, సీఐ కె.విజయబాబు పర్యవేక్షణలో గురువారం పోలీసులు నకిలీ ఎస్‌ఐ సంజయ్‌రాజును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
నిందితుడిపై గతంలో రాజమహేంద్రవరం-1, రాజమహేంద్రవరం-3, రాజానగరం, రావులపాలెం, శ్రీకాకుళం, ఏఆర్‌పురం ప్రాంతాల్లో పలు కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
Post a Comment