ఐ లవ్ ముహమ్మద్ ﷺ’ నినాదాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధం
జమాతే-ఇ-ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి
ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, “ఐ లవ్ ప్రవక్త ముహమ్మద్ ﷺ” నినాదం మత గందరగోళానికి కారణం అవుతుందనే వాదన పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. ఇది భారతదేశ ఉమ్మడి నాగరికతకు, అన్ని మతాలను గౌరవించే సంప్రదాయానికి అవమానం అని విమర్శించారు.
APCR డేటా ప్రకారం, కాన్పూర్‌లో మొదలైన ఈ పోలీసు చర్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాయని, ఇప్పటివరకు 21 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 1,324 మందిపై కేసులు పెట్టి, 38 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీటిలో ఎక్కువ చర్యలు ఉత్తరప్రదేశ్‌లోనే జరిగాయని, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్రల్లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.
చిన్న సమస్యను ఉద్దేశపూర్వకంగా పెద్దదిగా మార్చి సమాజంలో ఉద్రిక్తతలు రేకెత్తిస్తున్నారని ఆరోపించిన నిజామి, ఇది మత సామరస్యాన్ని భంగపరచడం, అమాయక పౌరుల ప్రాథమిక హక్కులను హరించడం కిందికి వస్తుందని అన్నారు. పోలీసుల దూకుడు చర్యలు ప్రజాస్వామ్యంపై ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నాయని విమర్శించారు.
అలాగే ముస్లిం సమాజం శాంతి, జ్ఞానం, విశ్వాసంతో స్పందించాలని, పవిత్ర ప్రవక్త ﷺ బోధించిన దయ, న్యాయం, శాంతి సందేశాలను సమాజానికి చాటి చెప్పే అవకాశంగా ఈ పరిస్థితిని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
ముస్లింలపై నమోదైన నిరాధార కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టయిన వారిని విడుదల చేయాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
“దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రాథమిక హక్కులను గౌరవించడం, సామరస్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం” అని ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి తెలిపారు.
Post a Comment