మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్!
హైదరాబాద్ : సెప్టెంబర్ 14: తెలంగాణలో వృత్తి విద్యా కళాశాలలు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే సెప్టెంబర్ 15 సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కాలేజీలు మూసివేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ ప్రకటించింది.
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, నర్సింగ్‌తో పాటు అన్ని ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కళాశాలలు ఈ బంద్‌లో భాగమవనున్నాయి.
నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగియడంతో, ఆదివారం మరోసారి మీటింగ్ జరగనుంది. అయితే సయోధ్య కుదరకపోతే రేపటి నుంచి కాలేజీలు బంద్ అవుతాయని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.
అటు ఇంటర్, డిగ్రీ కళాశాలలు కూడా తమ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక, విద్యాశాఖలతో సమీక్ష జరిపి, దశలవారీగా బకాయిలు క్లియర్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
గత ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన రూ.8,000 కోట్ల బకాయిలే ఈ నిరసనకు ప్రధాన కారణం. గత ఏడాది ప్రభుత్వం రూ.1,200 కోట్ల టోకెన్లు జారీ చేసినప్పటికీ, చెల్లింపులు విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
"అప్పులు పెరిగిపోతున్నాయి... బోధనా సిబ్బంది, ఇతర ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం" అని కాలేజీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మెను విరమించుకోవాలని కోరారు.
👉 మరి ఈరోజు చర్చలు ఫలిస్తాయా..? లేక రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు బంద్ దిశగా వెళ్తాయా..?
Post a Comment