42% బీసీ రిజర్వేషన్ అంతా బోగస్ : కాంపెల్లి కనకేష్ పటేల్
పాల్వంచ, అక్టోబర్ 9: బీసీలపై కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్న ప్రేమ అంతా కపటమని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ మండిపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, అనేక బోగస్ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత నెలకొంది అని ఆయన అన్నారు. అదే నేపథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కపటత్వానికి నిదర్శనమని విమర్శించారు.
హైకోర్టు జీవో నెంబర్ 9 పై స్టే విధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని కనకేష్ పటేల్ తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు చేసి, తామేదో బీసీ వర్గాల పక్షాన పనిచేస్తున్నట్టు ప్రభుత్వ ప్రచారం నడిపిందని ఆరోపించారు. “చెల్లని జీవో తెచ్చి, చట్టం ముందు బోర్లా పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అయోమయంలో ఉంది. బీసీల మనోభావాలను దెబ్బతీసే ఈ మోసపూరిత నిర్ణయం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు,” అని ఆయన అన్నారు.
ప్రభుత్వం డ్రామాలు ఆపి ప్రతిపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి తగిన శిక్ష తప్పదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది,” అని కాంపెల్లి కనకేష్ పటేల్ హెచ్చరించారు.

Post a Comment