ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుపాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
అమరావతి, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ (గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు మూసివేశారు.
ఇప్పటికే బుధవారం కూడా నెల్లూరు జిల్లాలో వర్షాల తీవ్రత దృష్ట్యా సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు: 📞 0861-2331261, 7995576699
వాతావరణ శాఖ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలో మరో ఐదు రోజుల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మత్స్యకారులకు సూచనలు
శనివారం వరకు సముద్ర పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి
ప్రభావిత జిల్లాల్లో రక్షణ చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Post a Comment