వ్యక్తి ఆత్మహత్య కేసులో ఎనిమిది మందికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
కొత్తగూడెం: వ్యక్తి ఆత్మహత్య కేసులో ఎనిమిది మంది నిందితులకు కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్ కుమార్ శుక్రవారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు వివరాల ప్రకారం— అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన గూడూరు శ్రీనివాసరెడ్డి, తన తండ్రి గూడూరు మల్లారెడ్డి ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, కుటుంబానికి చెందిన రెండు ఎకరాల వారసత్వ భూమిపై అదే గ్రామానికి చెందిన మేడవరపు మంగపతిరావు, మేడవరపు సుధీర్, మేడవరపు సురేష్, పర్వత నరేష్, తుక్కని రామిరెడ్డి, కాసరబాడ సత్యం, కాసరబాడ రాములు, కాసరబాడ సందీప్, గూడూరు జనార్దన్‌రెడ్డి తదితరులు బలవంతంగా ఆక్రమించుకున్నారని తెలిపారు.
భూమి వివాదంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ భూమి తిరిగి ఇవ్వలేదని, అంతేకాక పెద్దమనుషుల సమక్షంలో తండ్రిని తిట్టి చితకబాదారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, ఈ నేపథ్యంలో నిందితులు “నువ్వు చనిపో లేదా మేమే చంపేస్తాం” అంటూ బెదిరించారని ఆయన పేర్కొన్నారు.
ఆవేదనకు గురైన మల్లారెడ్డి, న్యాయం దొరకదని భావించి, 2021 మార్చి 3న తన వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజు దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించారు.
విచారణలో 12 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈలోగా నిందితుడు కాసరబాడ సత్యం మరణించాడు. విచారణ అనంతరం మిగిలిన ఎనిమిది మందిపై నేరం రుజువై, కోర్టు కఠిన శిక్ష విధించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య, లైజాన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, డ్యూటీ ఆఫీసర్ పిసి ఎం. ఈశ్వరరావు సహకారం అందించారు.

Post a Comment