అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు మృతి

 

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు మృతి

టెక్సాస్‌లో జరిగిన విషాదం – కుటుంబంలో విషాద ఛాయలు

అమెరికాలో మరోసారి భారతీయ విద్యార్థి ప్రాణాలు బలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ (27) అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో దుండగుడి కాల్పులకు బలయ్యాడు. డెంటల్ సర్జరీలో మాస్టర్స్ చదువుతూ, అదనంగా జీవనోపాధి కోసం స్థానిక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి స్టేషన్‌లోకి వచ్చి చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మృతుడి కుటుంబం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందినది. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎల్బీనగర్‌లోని చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించి ఆత్మీయంగా మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని హామీ ఇచ్చారు.

ఈ ఘటనతో అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.