నిర్మల్ కలెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్ కలకలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

 

నిర్మల్ కలెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్ కలకలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించిన ఘటన కలకలం రేపుతోంది. ఇది కేవలం వదంతి కాదని, వాస్తవమని అధికారులు ధృవీకరించారు. తెలియని వ్యక్తులు కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో ఫేక్ అకౌంట్ రూపొందించి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందికి సందేశాలు పంపినట్టు గుర్తించారు.

ఇప్పటికే ఆ నెంబర్ నుంచి పలువురికి సందేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ నెంబర్‌కి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్యాలయం సూచించింది.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కలెక్టర్‌గా ఉన్న ముషారఫ్ అలీ పేరిట కూడా నకిలీ వాట్సాప్ ఖాతాలు క్రియేట్ చేయబడ్డాయి. ఆ సమయంలో కూడా అనుమానాస్పద నంబర్ల నుంచి అధికారులకు సందేశాలు పంపిన ఘటన వెలుగుచూసింది.

తాజాగా +66958518330 నెంబర్‌ నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కాల్ వచ్చినట్టు సమాచారం. ఈ నెంబర్ థాయ్‌లాండ్‌కి చెందినదిగా గుర్తించబడింది. కలెక్టర్ స్థాయి అధికారుల పేరుతోనే ఇలాంటి ఫేక్ అకౌంట్లు సృష్టించడం, సామాన్యులు ఎంత అప్రమత్తంగా ఉండాలనే ప్రశ్నను లేవనెత్తుతోంది.

జిల్లా ప్రజలు, అధికారులు ఎవరైనా అనుమానాస్పద నంబర్ల నుంచి సందేశాలు లేదా కాల్స్ అందితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వాటిని నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం హెచ్చరించింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.