గ్రూప్-1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరి – కల్వకుంట్ల కవిత

గ్రూప్-1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరి – కల్వకుంట్ల కవిత


హైదరాబాద్: అక్టోబర్ 07: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా, ఆ అభ్యర్థులకు ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆమె గుర్తు చేశారు.

“ఇది రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియలో ఎన్ని తప్పులు చేసిందో సర్వోన్నత న్యాయస్థానం స్వయంగా ఎత్తిచూపినట్టే. నోటిఫికేషన్ విడుదల నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రభుత్వం మరియు టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం, చట్టవిరుద్ధ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని కవిత మండిపడ్డారు.

గ్రూప్-1 నియామకాల్లో న్యాయవివాదం ఇంకా తేలకముందే ప్రభుత్వం మెయిన్స్ పరీక్ష ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేయడం తగదని ఆమె హెచ్చరించారు. “న్యాయస్థానాలు తుది తీర్పు ఇవ్వకముందే అభ్యర్థుల ఆన్సర్ షీట్లు తొందరపడి నాశనం చేస్తే, నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను స్తంభింప చేస్తాం” అని కవిత స్పష్టం చేశారు.

ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడమే కాకుండా, పారదర్శకత లేకుండా పరీక్షల నిర్వహణ జరిపిందని ఆమె విమర్శించారు. “ఈ నియామకాలు తెలంగాణ యువత భవిష్యత్తుతో ఆడుకున్నట్టే” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.