సర్దార్ వల్లభభాయ్ పటేల్ చూపిన మార్గంలో యువతీ–యువకులు ముందుకు సాగాలి
దేశ సమగ్రత, ఐక్యత కాపాడటంలో ఉక్కుమనిషి సర్దార్ పటేల్ కృషి నేటి తరానికి ఆదర్శం – ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్
ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు సాగింది.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు, స్థానికులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ –దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటంలో ఉక్కుమనిషిగా పిలవబడే సర్దార్ పటేల్ కృషి ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో భారతదేశం పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టటానికి ప్రతి పౌరుడు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత తమ ఆలోచనలు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలుచుకోవాలని సూచించారు.
అలాగే, అక్టోబర్ 21 నుండి ఈ రోజు వరకు “పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు” కూడా విజయవంతంగా నిర్వహించామని ఆయన తెలిపారు.
తరువాత జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ –సర్దార్ పటేల్ నిర్ణయాలు స్వతంత్ర భారతదేశాన్ని బలమైన ఐక్యతతో ముందుకు నడిపాయని అన్నారు. దేశ ప్రజలు ఐకమత్యంతో జీవించేలా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి, ఐక్యతా భావం పెంపొందుతుందని అన్నారు. తరువాత జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ జెండా ఊపి రన్ ఫర్ యూనిటీకి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, 6వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసిఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి మరియు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment