ఏపీని వణికిస్తున్న ‘మొంథా’ తుపాన్!
అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్‌పై ‘మొంథా’ తుపాన్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి, ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాన్, మచిలీపట్నానికి 230 కిమీ, కాకినాడకు 310 కిమీ, విశాఖపట్నానికి 370 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. రాత్రి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలు – గాలివానలు
తుపాను ప్రభావం సుమారు 18 గంటల పాటు కొనసాగనుంది. ఈరోజు, రేపు 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధవారం కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుపాను ప్రభావంతో గంటకు 90–110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలోని 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం నుండి ప్రకాశం వరకు తీరప్రాంతాల్లో ప్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అత్యవసర అవసరాలు తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది.
ఉప్పాడ తీరం వద్ద అలల ఉద్ధృతి
మొంథా తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉద్ధృతి పెరిగింది. సముద్ర అలల దాడికి బీచ్ రోడ్డు ధ్వంసమై, రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పాడ తీరం కూడా కోతకు గురవుతోంది.
రైల్వే శాఖ అప్రమత్తం
తుపాను దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ మోడ్‌లోకి ప్రవేశించింది. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రైల్వే ట్రాక్‌లు, వంతెనలు సురక్షితంగా ఉన్నాయో లేదో పెట్రోలింగ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. స్టేషన్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడంతో పాటు, నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ఆహార పదార్థాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Post a Comment