జమ్మికుంటలో వికటించిన మధ్యాహ్న భోజనం – 20 మంది విద్యార్థులకు అస్వస్థత

 

జమ్మికుంటలో వికటించిన మధ్యాహ్న భోజనం – 20 మంది విద్యార్థులకు అస్వస్థత

ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

జమ్మికుంట, నవంబర్ 10: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వం బాలికల పాఠశాలలో ఈరోజు మధ్యాహ్నం ఘోర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనంగా ఇచ్చిన కల్తీ ఆహారం తిన్న 20 మంది నిరుపేద విద్యార్థులు ఆకస్మికంగా అస్వస్థతకు గురై, స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స కోసం చేర్చబడ్డారు. విద్యార్థులు వాంతులు, తలనొప్పి, మలబద్ధకం వంటి లక్షణాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) నాయకులు తక్షణమే దవాఖానకు చేరుకుని బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైద్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. నాయకులు మాట్లాడుతూ, పాఠశాలలో గత కొన్ని రోజులుగా కుళ్లిపోయిన కూరగాయలు, గుడికి ఉడకని అన్నంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముందుగానే ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థి సంఘ నేతలు తీవ్రంగా స్పందిస్తూ,

“రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటయ్యాక నుంచి పేద, మధ్యతరగతి విద్యార్థులు మధ్యాహ్న భోజనం కారణంగా అనారోగ్యం పాలవడం కొత్త విషయం కాదు. కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని, విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలి” అని డిమాండ్ చేశారు.

సమాచారం ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 1:30 గంటలకు చోటు చేసుకున్నప్పటికీ, ఎంఈఓ గారు సాయంత్రం 4:30 తర్వాతే పాఠశాలకు చేరుకున్నారు. రాగానే “పిల్లలు బాగానే ఉన్నారు, ఒకరిద్దరికే స్వల్ప అస్వస్థత ఉంది” అంటూ నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆగ్రహానికి కారణమైంది.

విద్యార్థి నాయకులు జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మద్దతుగా విద్యార్థి నాయకులు కొమ్ము నరేష్, అప్పని హరీష్, వర్మ, ఆవుల తిరుపతి యాదవ్, నరెంగుల శివ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.