రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 21 మంది మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం మృతదేహాలను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఉస్మానియా ఆస్పత్రి వైద్య బృందంతో పాటు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణులను కూడా పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొనాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ఇప్పటికే వైద్యుల బృందం ఉస్మానియాకు చేరుకుంది.
ఇదే సమయంలో గాంధీ ఆస్పత్రిలో క్షతగాత్రుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. “గాయపడిన వారు వస్తే తక్షణ చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం” అని గాంధీ ఆస్పత్రి వైద్యుల బృందం వెల్లడించింది.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించింది.

Post a Comment