ఆడవాళ్లు చితక్కొట్టేశారు... వరల్డ్ కప్ మనదే..! 🇮🇳
భారత మహిళల క్రికెట్ చరిత్రలో నేటి రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీని చివరకు టీమిండియా సొంతం చేసుకుంది.
ఆదివారం ముంబైలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో, భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్ చరిత్రలో భారత మహిళల జట్టు మొదటిసారి కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరును ఖాతాలో వేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాణించగా, స్మృతి మంధాన (45) చక్కటి భాగస్వామ్యం అందించింది.
మధ్యలో వికెట్లు కోల్పోయిన సందర్భంలో దీప్తి శర్మ (58 పరుగులు) అద్భుత అర్ధ సెంచరీతో జట్టును నిలదొక్కింది. చివర్లో రిచా ఘోష్ (34) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 300 మార్కుకు చేరువైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక మూడు వికెట్లు పడగొట్టినా, భారత బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు.
299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా మంచి ప్రారంభం అందుకున్నా, భారత స్పిన్ దాడి ముందు నిలవలేకపోయింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (101 పరుగులు) మాత్రమే అద్భుత సెంచరీతో పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో ప్రధాన హీరోగా నిలిచింది దీప్తి శర్మ. బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్న ఆమె, బౌలింగ్‌లో ఐదు వికెట్లు (5/39) తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను చిత్తు చేసింది. కీలక సమయాల్లో ఆమె తీసిన వికెట్లు మ్యాచ్ గమనాన్ని భారత్ వైపు తిప్పేశాయి.
అదే విధంగా యువ ఓపెనర్ షెఫాలీ వర్మ రెండు కీలక వికెట్లు తీసి ఆల్‌రౌండర్ సామర్థ్యాన్ని నిరూపించగా, తెలుగు తేజం శ్రీ చరణి (1 వికెట్) కూడా తన వంతు పాత్ర పోషించింది.
ఈ విజయంతో భారత మహిళా క్రికెట్ కొత్త దశలోకి ప్రవేశించిందని, దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఘన స్వాగతం ఇవ్వడానికి బీసీసీఐ ఏర్పాట్లు ప్రారంభించింది.

Post a Comment