హైవేపై ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మందికి ప్రాణాలు కోల్పోయారు – ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మందికి ప్రాణాలు కోల్పోయారు – ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి


రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌–బీజాపూర్‌ హైవేపై రాంగ్‌ రూట్‌లో వేగంగా వచ్చిన టిప్పర్‌ ఒక ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఢీ తాకిడికి బస్సు కుడి భాగం పూర్తిగా ధ్వంసమైపోగా, టిప్పర్‌ బస్సుపై బోల్తా పడింది.

ఈ భయంకర ఘటనలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్‌ దస్తగిరి బాబా, టిప్పర్‌ డ్రైవర్‌తో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

గుర్తించిన మృతుల్లో తారిబాయ్‌ (45), కల్పన (45), బచ్చన్ నాగమణి (55), ఏమావత్ తాలీబామ్‌, మల్లగండ్ల హనుమంతు, గుర్రాల అభిత (21), గోగుల గుణమ్మ, షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్‌ ఉన్నారు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు — సాయిప్రియ, నందిని, తనూష దుర్మరణం పాలవ్వడం కుటుంబ సభ్యులను కన్నీటిలో ముంచింది. వీరు హైదరాబాద్‌లో చదువుకుంటూ, వీకెండ్‌ సెలవుల్లో ఇంటికి వెళ్లి తిరిగి కాలేజీకి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురిని వారి తండ్రి బస్టాప్‌ వద్ద దింపిన కాసేపటికే ఈ ఘోరం చోటుచేసుకుంది.

ఇక మరొకరు, లక్ష్మీనారాయణపూర్‌ గ్రామానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని అఖిల ప్రియా రెడ్డి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

గాయపడినవారిలో వెంకటయ్య, బుచ్చిబాబు, అబ్దుల్‌ రజాక్‌, వెన్నెల‌, సుజాత‌, అశోక్‌, రవి, శ్రీను, నందిని, బస్వరాజ్‌, ప్రేరణ, సాయి, అక్రమ్‌, అస్లామ్‌ ఉన్నారు. వీరిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద స్థలంలో దారుణ దృశ్యాలు నెలకొన్నాయి. అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.