ప్రభుత్వ నిర్లక్ష్యంపై జర్నలిస్టుల గర్జన డిసెంబర్ 3న హైదరాబాద్‌లో మహా ధర్నా
తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కానంతకాలం ఆందోళన మరింత తీవ్రం కానున్నది. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TSUWJ-టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్‌లో మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ స్పష్టం చేసింది.
యూనియన్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ — “12 సంవత్సరాలుగా జర్నలిస్టుల జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. పాత హామీలు అన్నీ మరిచిపోయినట్లుగా అధికారుల ప్రవర్తన ఉంది” — అంటూ విమర్శించారు.
జర్నలిస్టుల కీలక డిమాండ్లు
-
కొత్త అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించాలి12ఏళ్లుగా నిలిచిపోయిన కార్డుల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని యూనియన్ డిమాండ్.
-
ఆరోగ్య బీమా పథకం పునరుద్ధరణవేలాది జర్నలిస్టులు వైద్య భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారన్న వాదన.
-
ఇళ్ల స్థలాల మంజూరుఅర్హులైన జర్నలిస్టులందరికీ భూ పంపిణీ చేయాలని డిమాండ్.
-
వృత్తి కమిటీల ఏర్పాటు
-
చిన్న, మధ్యతరగతి పత్రికలకు ప్రభుత్వం ఆదరణ
యూనియన్ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకే శబ్దంలో విమర్శించారు. “ఎన్నికల హామీలన్నీ మాటల్లోనే మిగిలిపోయాయి” అని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
నవంబర్ 6న కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం
నవంబర్ 6న జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎదుర్కోవాలంటే ప్రత్యక్ష చర్యలు అవసరమనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో డిసెంబర్ 3 ధర్నా ప్రకటించినట్లు యూనియన్ తెలిపింది.
33 జిల్లాల జర్నలిస్టులకు పిలుపు
ఈ మహా ధర్నాలో రాష్ట్రంలోని 33 జిల్లాల జర్నలిస్టులు భారీ ఎత్తున పాల్గొని, తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా నిలబడాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఇతర నాయకులు పిలుపునిచ్చారు.

Post a Comment