కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం… 32 దుకాణాలు భస్మం | కోట్లల్లో ఆస్తి నష్టం

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం… 32 దుకాణాలు భస్మం | కోట్లల్లో ఆస్తి నష్టం


జగిత్యాల జిల్లా, కొండగట్టు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అక్కడి వ్యాపారులను విషాదంలో ముంచేసింది. రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలను చుట్టుముట్టి క్షణాల్లో పెద్దఎత్తున విస్తరించాయి. ఈ ఘటనలో మొత్తం 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమ్మక్క–సారలమ్మ జాతర కోసం నిల్వ చేసిన సరుకే బూడిద

కొద్ది రోజులలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీగా సరుకును కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు. ఒక్కో దుకాణంలో ₹8 లక్షల నుండి ₹10 లక్షల విలువైన బొమ్మలు, గాజులు, పూజా సామగ్రి ఉన్నట్లు సమాచారం.
ఈ భారీ నష్టంతో వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, అక్కడ విషాద వాతావరణం నెలకొంది.

అగ్నిమాపక సిబ్బంది చేరుకునేసరికి…

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, అప్పటికే మంటలు అదుపు దాటిపోయాయి. కాసేపటికే దుకాణాలన్నీ పూర్తిగా బూడిదగా మారాయి.

షార్ట్‌ సర్క్యూట్‌నే కారణమని అధికారులు

మల్యాల, ధర్మపురి సీఐలు రవి, రాంనర్సింహారెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కొండగట్టులో జరిగిన ఈ అగ్నిప్రమాదం స్థానిక వ్యాపారులకు అతిపెద్ద ఆర్థిక దెబ్బగా మారింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.