వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి

 

తిరుమల ప్రసాద వ్యాఖ్యలపై వివాదం… వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి

తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న ప్రముఖ యాంకర్ శివజ్యోతి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత బేషరతుగా క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా ఉన్నాయనే విషయాన్ని అంగీకరిస్తూ, ఒక వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చుకున్నారు.

ఇటీవల తిరుపతి దర్శనం సందర్భంగా ప్రసాదం గురించి she చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రతిచర్యలకు దారితీశాయి. ఆమె మాటలతో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన శివజ్యోతి—“పొద్దున్నుంచీ నా మాటల వల్ల చాలా మంది బాధపడ్డారు. ముందుగా హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను” అని పేర్కొన్నారు.

అంతేకాక, తమ కుటుంబంతో కలిసి రూ.10,000 ఎల్1 లైన్‌లో దర్శనం చేసిన విషయాన్ని తాను పేర్కొన్నప్పటికీ, దాన్ని ‘‘అహంకారంగా’’ చెప్పినట్టుగా ఎవరూ భావించవద్దని స్పష్టం చేశారు.
“అది కేవలం మనం వెళ్లిన లైన్ గురించి చెప్పిన మాట మాత్రమే. ‘మేము ధనవంతులం’ అనే భావం నాకు లేదు” అని తెలిపారు.

తనకు వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తిని ప్రస్తావిస్తూ,
“నాకు అత్యంత విలువైన నా బిడ్డను స్వామి ఇచ్చాడు. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడటం అసాధ్యం. నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నాను” అని భావోద్వేగంతో అన్నారు.

తన మాటల్లో లోపం ఉన్నదన్న విషయాన్ని ఆమె అంగీకరించారు. “నా ఉద్దేశం అది కాదు. కానీ మాటలు తప్పుగా వెళ్లాయి – ఇది నిజం. యూట్యూబ్ ఛానెల్లు, కేసులు భయపెట్టాయి కాబట్టి కాదు… నాకే అనిపించింది నేను అలా మాట్లాడకూడదని. అందుకే క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగదు” అని చెప్పారు.

శివజ్యోతి క్షమాపణతో ఈ వివాదం సద్దుమణిగినట్లేనని సోషల్ మీడియాలో పలువురు భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.