తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల హెచ్చరికలు!
హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణలో నేడు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం వేళల్లో ఎండ కనిపించినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై రాత్రివేళల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ క్రమంలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి–భువనగిరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం రాబోయే రెండు గంటల్లో యాదాద్రి–భువనగిరి, జనగామ, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఒక్క రోజులోనే 422 మి.మీ. వర్షపాతం నమోదై చరిత్ర సృష్టించింది. మొత్తంగా జూన్–అక్టోబర్ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 33 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత మూడు సంవత్సరాల అక్టోబర్ వర్షపాతం పోలిస్తే —
- 2021లో: 80 మి.మీ.
- 2022లో: 60 మి.మీ.
- 2023లో: 95.9 మి.మీ.
- 2025లో: 175 మి.మీ.
ఈ గణాంకాలు ఈ ఏడాది తెలంగాణలో వర్షాల తీవ్రత ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తున్నాయి.

Post a Comment